గుడ్డిగా నేను ఏ సూపర్ స్టార్ ని ఏ డూపర్ నాయకుణ్ణి అనుసరించను.
ఈ స్వతంత్ర భారత దేశంలో, ఈ ప్రపంచపు కుగ్రామంలో ( అత్యాధునిక సమాచార సాంకేతికతతో సాధికారమైన ) మనం శాంతిని, ఆనందాన్ని, అభివృధిని సాధించలేమా ?
వాటిని సాధిచుటకు సాటి మనుషులను హింసించాల్సినదేనా ? ఏమో !!
ఒక విద్యార్ధి అంటే రేపటి పౌరుడు, దేశ భవిష్యత్తు వాళ్ల చేతిలోనే ఉంటుంది - ఆ విద్యార్ధికే భవిష్యత్తు లేకుండా పోతే !!! - అతని కన్న తల్లిదండ్రుల పరిస్తితి ఏమిటి ? ఎంతో ఓపిక, సహనం, సమయం, ధనం వెచ్చించి - అన్నింటికన్నా విలువైన "ప్రేమను" పంచి, పెద్దది చేసిన దానికి విలువ ఏమిటి, దాని పర్యవసానం ఏమిటి ?
ఉన్నదంతా ఊడ్చి, అమ్మి, తలతాకట్టు పెట్టి మనం బాగుండాలి అని కోరుకునే మన తల్లిదండ్రులకి మిగిలేది ఏమిటి ?
ఒక విద్యార్ధి తప్పు చేస్తే అది అతని తప్పు కాదు,
అతనికి ప్రేమను పంచివ్వని పెద్దల తప్పు,
ఏది తప్పు ఏది ఒప్పు అనే వివేకం నేర్పించలేని వారి పెద్దల తప్పు.
ఒక మొక్కని పెంచి ఫలాలు ఇచ్చే చెట్టుని చెయ్యాలన్నా,
ఒక విద్యార్ధి పెరిగి ప్రయోజకుడు అవ్వాలన్నా వారి పెద్దలకు ఎంతో ఓర్పు నేర్పు అవసరం - చుట్టూ ఉండే వాతావరణ ప్రభావం ఎంతో ఉంటుంది.
ఒక విద్యార్ధి కళ్ళల్లో ఉండే ఆశ, మనసులో ఉండే స్వచ్చత, జ్ఞాన తృష్ణ, సాధించాలనే పట్టుదల, తపన, ఉరకలేసే ఉత్సాహం నాకు ఎన్నో సార్లు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించాయి.
అలాంటి విద్యార్ధికి రేపు అనేది లేకుండా చేసే కారణం ఏదైనా కూడా భరించలేనిది - దేశ భవిష్యత్తు విద్యార్ధుల బుర్రలో ఉందన్న నిజం విస్మరిచలేనిది కాబట్టి.
సూపర్ స్టార్స్, డూపర్ రాజకీయ నాయకులు వాళ్ల కుటుంబం గురించే తపన పడుతుంటారు. మరి మనం ?
మన తల్లి దండ్రులు మనకి ఇచ్చిన ప్రేమను వారికి తిరిగి ఇచ్చే బాధ్యత మనకు లేదా ? ఊర్లో వాళ్ల కోసమా మన తాపత్రయం ?
15 ఏళ్ల క్రితం ఒక సారి నేను అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో చేరి - నానా తంటాలు పడి చివరికి బతికి బట్ట కట్టిన తరువాత అనిపించింది - ఏమిటి ఈ జీవితం, ఏంటి ఈ దౌర్బాగ్యం అని ?
సరే మనకన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, అడిగి తెలుసుకుందాం అని ఒక హిందూ మత ప్రభోదకుడి ఇంటికి వెళ్ళాను - వరుసగా రొండు రోజులు వెళ్లి మాట్లాడను - అతను చెప్పింది ఒక్కటి కూడా అర్ధం కాలా. కానీ ఒకటి మాత్రం అర్ధం అయింది - అతను తరవాత ఉదయం మా ఇంటికి వచ్చి నా గురించి వెటకారంగా మా నాన్నతో మాట్లాడి నవ్వుకుంటున్నారు.
క్రైస్తవ మత ప్రభోదకుల ఇంటికి కూడా వెళ్ళాను - చనిపోయిన తరవాత మనం స్వర్గానికి వెళ్తాం - అక్కడ అంతా బంగారంతో చేసిన వస్తువులు ఉంటాయి అనేది మాత్రం అర్ధం అయింది.
ఏది ఏమైనా, ఇతరులను హింసించు, అని మాత్రం ఏ మతం చెప్పడం లేదు అనేది మాత్రం బాగా అర్ధం అయ్యింది. మనం స్వర్గ సుఖాలు పొందాలంటే ఇంకొకరికి నరకం చూపించాలి అని ఏ దేవుడు చెప్పడం లేదు.
" 7 Habits of Highly Effective People - Stephen R Covey " అనే పుస్తకం చదువుతున్నప్పుడు మాత్రం అది నా కోసమే రాసారు, నా గురించే రాసారు అనిపించింది. చాలా బాగా అర్ధం అయింది.
"విజయానికి 5 మెట్లు - యండమూరి వీరేంద్రనాథ్" పుస్తకం చదవడం మొదలు పెట్టగానే ఒక ధ్యాన స్తితి లోకి వెళ్ళిపోయాను.
"A Good Book will substitute the lack of a Good Friend beside you" - Mahatma Gandhi
అందుకే అర్దిస్తున్నాచదువుకోండి, చదివించండి.
స్వర్గానికి వెళ్ళాలన్న ఆశ అస్సలు లేదు కానీ
నేను ద్వేషిస్తున్నా, ద్వేషాన్ని, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నా, దేశాన్ని.
"దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్."