ప్రేమ చరిత్ర

అజ్ఞానాన్ని చూసి నేను అపహాస్యంగా నవ్వను,
అజ్ఞానాన్ని నేను వెక్కిరించను.
అజ్ఞానాన్ని నేను తన్నను, తిట్టను.

నాకేంటి అవసరం, నాకేంటి అవసరం ?

నా అవసరం ఏంటి, నా అవసరం ఏంటి, నా అవసరం ఏంటి ?
నా సమస్యలు తీర్చే జ్ఞానం, జ్ఞానం మాత్రమే

నా అవసరం ఒక్కటే, అది జ్ఞానం, విశ్వ జ్ఞానం, విజ్ఞానం.
అది సాధించుటకు కలం పట్టడానికి, నేనా వెనుకాడేది ?

నేను ఆనందంగా ఉండాలనే నా తల్లి తపన, నేను సమాజంలో గౌరవంగా జీవించాలనే నా తండ్రి తపన నేను చదువుకున్నాను.
అర్దరాత్రి, అపరాత్రి అని కూడా చూసుకోదు తల్లి తన తపన గురించి, ఒక ఏడా, పాతిక ఏళ్ళా అని కూడా చూసుకోదు తండ్రి తపన
వారు చూపిన ఓర్పు, సహనం, ఔదార్యం, ఆదరణ తప్ప భూ ప్రపంచంలో ఏది కూడా నాకు ఉపయోగపడలేదు, ఈ జీవితాన్ని కాపాడటానికి.

నా అవసరం నా తపన ఒక్కటే, నా తల్లి దండ్రులు ఇచ్చిన ప్రేమ, జ్ఞానం వారికి పిసిరంతైనా, వీలయితే కొండంత తిరిగి ఇస్తూ ఉండాలని.

ఆ విధంగా వారి ప్రేమను బ్రతికించాలని, పెంచి పెద్దది చెయ్యాలన్నదే నా తపన.
ఆ విధంగానే కదా ఈ సృష్టి, ప్రతి సృష్టి జరుగుతున్నది !!!
( చాలా మంది మానవుల విషయంలో అలా జరగడం లేదు - అదే మానవాళి యొక్క దౌర్బాగ్యం - నరకానికి దగ్గరి దారి )

'హృదయం ఎక్కడున్నది' అని నేను ఎవరిని అడగాలి ? నా కుటుంబం చుట్టూ తిరుగుతున్నది అనే కదా నేను చదువుకున్నది ? జగమంత కుటుంబం కాకపోయినా పర్లేదులే, నా స్వార్ధం కోసం నా వాళ్ళను నేను సొంతం చేసుకునే విద్య ఏదయినా నేర్చుకోవాలన్నదే నా తపన.

నా స్వార్ధం కోసం నేనెవరికీ సమస్య కాకూడదు - వీలైనంత వరకు ఇతరులకు పనికి వచ్చే పనులు చెయ్యాలన్నదే నా ఆలోచన. పనికి రాని మాటలు, పనులు నేను ఎందుకు చెయ్యాలి ? ఆహ్, ఎందుకు చెయ్యాలి అన్నదే నా ప్రశ్న?

నా దేశానికో, కుటుంబానికో హాని చేసే శత్రువులు అయితే తంతా, హింసను అడ్డుకోవడానికి, నష్టాన్ని నివారించడానికి.
నా రాజకీయ శత్రువులు అయితే తిడతా, మంచి మంచి తిట్లు వెతికి మరీ తిడతా, అసలు విషయం మడత పెడతా.

నా తోటి వారు నన్ను తిట్టిన నా మైండ్ బ్లాక్ అగును, మరి నేను తిట్టిన అదే కదా వారికీ జరుగును. ఇదేమన్నా వింతనా ?
ఈ విధంగా మైండ్ బ్లాక్ అయినచో ఏమిటి ఉపయోగం, సర్వం దండగ తప్ప.

ఈ భూమాత నాకు ఉప్మా పెడుతున్నంత కాలం ఎవడి రక్త చరిత్ర, హీన చరిత్ర గురించి నాకెందుకు చెప్మా!
నాకెందుకంట ఆ కర్మ, ఉండగా రాంగోపాల్ వర్మ!

ఆలోచన లేని ఆవేశాలకు,
ఫలితం లేని పంతాలు, పట్టింపులకు,
ఏ తెడ్డు లేని తెగింపుకి పోతే, మరి ఏ చరిత్ర మనం రాసుకోవలసినది ?

భావి తరానికి మనం అందించాల్సినది ఏమిటి ?
కలమా, కత్తా ?
అక్షరాభ్యాసం ఒక్క రోజు అందిస్తే సరిపోతుందా
ఆ కలం కలకాలం గుండె మీద ఉండేట్టు చూడాల్సిన భాద్యత లేదా ?

"దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్."

ఈ జ్ఞానమేగా మనకి మన పెద్దవాళ్ళు ఇచ్చింది ?

ఇప్పుడు చదువులు ఎక్కువైపోయినవా లేక సినిమాలు ఎక్కువైపోయినవా
పోటీలు పడి సినిమాలు తీసే ధన దాహం ఎక్కువయిపోయిందా
లేక 'నేను మాత్రమే గొప్ప' అనుకునే అహంభావం ఎక్కువయిపోయిందా ?

ముందు చూపు లేకుండా పిల్లల్ని కని చెత్త కుప్పల్లో విసిరేసే మనుషులు ఎక్కువ అయిపోయారని మాత్రం కచ్చితంగా చెప్పగలను.

అయినా నా పుస్తకంతో మీకేంటండి పని ? ఆహ్ ?
మీ పుస్తకం మీరు రాసుకోక ? ఏవిటీ ఈ విడ్డూరం ? ఏవిటో, ఎందుకో ?

ఓహ్, నా తప్పులు వెతికి తిట్టాలని ఉందా ?
నేను చేతకాని వాణ్ణి అని నిరూపించి అపహాస్యం చెయ్యాలని ఉందా ?

అయితే ఓకే.
అలా కానీయండి మరి.
ఎవరి జీవితం వారిది, ఎవరి తపన తాపత్రయం వారిది.